Vijayashanthi: బీజేపీలో చేరనున్న విజయశాంతి?
- తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు
- గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాలు
- పార్టీ అగ్ర నాయకత్వం కనుసన్నల్లో సంప్రదింపులు
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో నెంబర్ టూ అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి హైదరాబాదు వరకు పార్టీని బలోపేతం చేయాలంటూ రాష్ట్ర పార్టీ నేతలకు ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
ఈ క్రమంలో, తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేదే ఆ వార్త. ఆమెతో పాటు ఒక మాజీ ఉపముఖ్యమంత్రి, పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురితో పార్టీ నాయకత్వం చర్చలు జరిపిందని... సంప్రదింపుల వ్యవహారం మొత్తం బీజేపీ జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం.
ఈ సందర్భంగా ఓ బీజేపీ అగ్రనేత మాట్లాడుతూ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన ముగ్గురు మాజీ ఎంపీలు, ఒక మాజీ డిప్యూటీ సీఎం, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు.