Kavitha: 17 ఏళ్లు నమ్ముకుని ఉంటే టీడీపీ నాకు అన్యాయమే చేసింది: సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం
- టీడీపీ, వైసీపీ పాలనలో తేడా లేదు
- స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపుతాం
- మండపేటలో నటి కవిత
తాను 17 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తే, తనకు సరైన న్యాయం జరగలేదని సినీ నటి కవిత వ్యాఖ్యానించారు. కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన కవిత, మండపేట పట్టణ వైశ్య నేత కాళ్లకూరి నాగబాబు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో తనకు గుర్తింపు లభించలేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు.
బీజేపీ ఒంటరిగానే పోటీచేసి తెలుగు రాష్ట్రాల్లో గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేసిన ఆమె, ప్రస్తుత జగన్ పాలనకు, గత చంద్రబాబు పాలనకు పెద్దగా తేడా లేదని విమర్శలు గుప్పించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు.
ఎంతో కాలంగా నలుగుతున్న జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించింది నరేంద్ర మోదీనేనని, ఆయన పాలనలో తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. తమ పార్టీ ఎన్నడూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు.
తాను ప్రస్తుతం సినిమాలు, టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని అన్నారు. తనకు బీజేపీలో మంచి గుర్తింపును ఇచ్చారని, ఆ పార్టీ ప్రజారంజక పాలనను చూపుతుందన్న విషయాన్ని కళ్ల ముందుంచిందని తెలిపారు. కేంద్రం అందిస్తున్న నిధులతో సంక్షేమ పథకాలను చేపడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటి రంగులు, పేర్లు మారుస్తూ, తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని అన్నారు.