Gujarath: కచ్ సరిహద్దులో రెడ్ అలర్ట్ : భారీగా బలగాల మోహరింపు
- ఉగ్రవాదులు చొరబడుతున్నారని సమాచారం
- ఇంటెలిజెన్స్ నివేదికతో అప్రమత్తమైన భారత్
- జల్లెడపడుతున్న నావికాదళం, సరిహద్దు పోలీసులు
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ సరిహద్దులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాయాది దేశం నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఈ ప్రాంతం గుండా భారత్లోకి వ్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు భారత్ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించింది. రాష్ట్ర, నావికాదళం, సరిహద్దు పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు.
ఈ సందర్భంగా తూర్పు కచ్ ఎస్పీ పరీక్షిత్ రాథోడ్ మాట్లాడుతూ సరిహద్దులో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా మెరైన్, బీఎస్ఎఫ్ పోలీసులను భారీగా తరలించినట్లు తెలిపారు. వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. అనుమానాస్పద వాహనాలు, పడవలు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సరిహద్దులోని ప్రజలు, మత్స్యకారులకు సమాచారమిచ్చినట్లు తెలిపారు. మరోవైపు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు.