nallamala forest: నల్లమల అటవీ ప్రాంతంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అరెస్టు
- యురేనియం తవ్వకాలకు అనుమతులపై నిరసన
- ప్రభుత్వ చర్యలపై మండిపడిన నేత
- భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని వ్యాఖ్యలు
తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాంను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు నల్లమల వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోదండరాంతోపాటు వెళ్లిన కాంగ్రెస్ నేతలు చిక్కుడు వంశీకృష్ణ, కోదండరెడ్డిలను కూడా అరెస్టు చేశారు. కాగా, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటోందని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 19 ప్రకారం తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ తమకు ఉందని గుర్తు చేశారు. శాంతిభద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగినప్పుడు మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాలను తాము శాంతియుతంగా చేస్తున్న నిరసన సమయంలో అమలు చేయడం దారుణమన్నారు.