Pakistan: 'కశ్మీర్ సంఘీభావ దినం'గా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న పాక్.. కశ్మీరీలంతా పాక్ ప్రజలే అన్న అధ్యక్షుడు
- కశ్మీరీలకు ఎప్పటికీ అండగా ఉంటాం
- వారి బాధలు మన బాధలే
- కశ్మీరీలకు పాక్ అండగా ఉండటాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు పాకిస్థాన్ జరుపుకుంది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా విడగొట్టిన నేపథ్యంలో... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 'కశ్మీర్ సంఘీభావ దినం'గా పాక్ జరుపుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ అండగా ఉందని, ఇకపై కూడా అండగానే ఉంటుందని చెప్పారు. కశ్మీరీ సోదరులకు అండగా పాక్ ప్రజలు నిలబడటాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందని తెలిపారు.
ఏ క్షణంలో కూడా కశ్మీరీ ప్రజలను పాకిస్థాన్ ఒంటరిగా వదిలిపెట్టదని అల్వీ చెప్పారు. కశ్మీరీలంతా పాక్ ప్రజలేనని... వారి బాధలూ మన బాధలేనని అన్నారు. కశ్మీరీలకు ఎప్పటికీ అండగా ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గట్టిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు.