Jammu And Kashmir: ఆర్టికల్ 370 రద్దుపై విదేశీ మీడియా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది!: వెంకయ్య నాయుడు ఆగ్రహం
- దీన్ని మతం కోణంలో చూడరాదు
- దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 370 రద్దు
- చండీగఢ్ లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడాన్ని మతం కోణంలో చూడరాదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్శిటీలో జరిగిన బలరామ్ జీ దాస్ టాండన్ తొలి స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధన మాత్రమేనని వెంకయ్య స్పష్టం చేశారు.
భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశమంతా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఈ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో కులం, లింగ వివక్ష, పేదరికం, నిరక్షరాస్యత వంటి సామాజిక రుగ్మతలను దేశం నుంచి తరిమికొట్టడానికి అందరూ కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు.