B.K.Eeshwar: కోటీశ్వరుడైన రజనీకాంత్ ఆ కిళ్లీ కొట్టును మాత్రం మరిచిపోలేదు: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్
- రజనీకి కిళ్లీ వేసుకోవాలని ఉండేది
- ఆ కిళ్లీ కొట్టతను ఫ్రీగా కట్టించేవాడు
- రజనీ తన మూలాలు మరిచిపోరు
రచయితగా .. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా బీకే ఈశ్వర్ కి ఎంతో అనుభవం వుంది. తాజాగా ఆయన రజనీకాంత్ గురించి తనకి తెలిసిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "రజనీ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించేటప్పుడు చెన్నై - రాయపేటలో గల కిళ్లీ కొట్టుకు వెళ్లేవారట. కిళ్లీ వేసుకోవాలనే కోరిక బలంగా ఉండేది కానీ ఆయన జేబులో డబ్బులు ఉండేవి కావు.
అది గ్రహించిన ఆ కిళ్లీ కొట్టు వ్యక్తి ఫ్రీగానే రజనీకి కిళ్లీ కట్టి ఇచ్చేవాడు. అంతేేకాదు ఎప్పటికైనా స్టార్ హీరోవి అవుతావని అనేవాడట. ఆ మాటలు రజనీకి తనపై తనకి మరింత నమ్మకాన్ని కలిగించేవి. ఆ తరువాత కాలంలో రజనీ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచైనా క్షణాల్లో కిళ్లీలు తెప్పించుకోగలరు. కానీ ఇప్పటికీ ఆయన 'రాయపేట'లోని ఆ కిళ్లీ కొట్టుకే స్వయంగా వెళ్లి కిళ్లీ కట్టించుకుని వేసుకుంటారు. మూలాలను రజనీ మరిచిపోరు అనడానికి ఈ విషయమే ఒక నిదర్శనం. ఈ సంగతిని ఒకసారి ఆయన రాధిక గారికి చెప్పగా, ఆమె ద్వారా నాకు తెలిసింది" అని ఈశ్వర్ చెప్పుకొచ్చారు.