Pakistan: భారత్ పై జిహాద్ తప్ప మాకు మరో మార్గం లేదు.. యుద్ధానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్
- కశ్మీర్ పై సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు పెట్టండి
- పీవోకేపై దాడులకు భారత సైన్యం సన్నాహకాలు చేస్తోంది
- ఉగ్రవాదంపై యుద్ధం చేసి రాటుదేలిపోయాం
భారత్ పై పాకిస్థాన్ మరోసారి విషాన్ని చిమ్మింది. యుద్ధం చేసేందుకు కూడా తాము సిద్ధమేనని చెప్పింది. పాకిస్థాన్ ఎప్పటికీ శాంతిని కోరుకునే దేశమని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అన్నారు. కానీ, భారత్ తమపై యుద్ధాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోందని... దీని ప్రభావం యావత్ ప్రపంచంపై పడుతుందని అన్నారు. యుద్ధ సన్నాహాలను చేస్తున్న భారత్ పై తమకు జిహాద్ తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థానే దే అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ గురించి సోషల్ మీడియాలో వీలైనన్ని ఎక్కువ పోస్టులు, వీడియోలు పెట్టాలని, భారత వ్యతిరేకతను ఒక ఉద్యమంలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. భావోద్వేగాలను రెచ్చగొట్టాలని పిలుపునిచ్చారు.
కశ్మీర్ ను రెండు ముక్కలు చేసిన భారత్... ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాసిందని అల్వీ మండిపడ్డారు. పీవోకేపై దాడులకు భారత సైన్యం సన్నాహకాలు చేస్తోందని చెప్పారు. బాలాకోట్ దాడుల తరహాలో కుట్రలు చేస్తోందని అన్నారు. భారత్ ఎలాంటి చర్యలకు దిగినా సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు. 20 ఏళ్లుగా ఉగ్రవాదంపై యుద్ధం చేసి రాటుదేలిపోయామని అన్నారు. ఇప్పుడు పాకిస్థాన్ ప్రజలంతా ఒకే పక్షాన ఉన్నారని చెప్పారు.