egg shell: గుడ్డు పెంకుతో భలే ‘గమ్'త్తు: విరిగిన ఎముకలు అతికించే బీటీ-టీసీపీ రసాయనం
- బాల్ మిల్లింగ్ పద్ధతి ద్వారా సేకరించచ్చు
- హైదరాబాద్ ఐఐటీ, జలంధర్ ఎన్ఐటీ విద్యార్థుల పరిశోధన
- ప్రస్తుతం వాడుతున్నది లోహాలు, రసాయనాలే
విరిగిన ఎముకలు అతుక్కోవడం అంత ఆషామాషీ కాదు. ఇక కాస్త వయసు దాటిన వారిలో అయితే మరింత సమస్య. ఒకవేళ అతికిందనిపించుకున్నా అది ఎప్పటికీ ‘అతుకే’. ధైర్యంగా ఆ అవయవంతో ఏ పనిచేయలేం. ప్రమాదం, ఇతరత్రా కారణాల వల్ల ఎముకలు విరిగిన వారికి ఇప్పటి వరకు లోహాలు, రసాయనాలు వినియోగించి ఎముకను అతికించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపై గుడ్డు పెంకు నుంచి సేకరించిన బీటా-ట్రైకాల్షియం ఫాస్పేట్ (బీటా-టీసీపీ)తో ఎముకను సులువుగా అతికించవచ్చని నిరూపించారు హైదరాబాద్ ఐఐటీ, జలంధర్ ఎన్ఐటీ పరిశోధక విద్యార్థులు. హైదరాబాద్ ఐఐటీలోని బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పరిశోధక విద్యార్థి రూపావత్ ఉదయ్ కిరణ్, ఆచార్యులు సుభా నారాయణ్రథ్, భరత్ పి.పాణిగ్రాని, జలంధర్ ఎన్ఐటీకి చెందిన ఆచార్య మహేష్ కుమార్‌లు ఈ పరిశోధనలు చేశారు.
బాల్ మిల్లింగ్ పద్ధతి ద్వారా గుడ్డు పెంకు నుంచి బీటా-టీసీపీని సేకరించవచ్చని నిరూపించారు. ఈ పౌడర్‌తో ఎముకకు ప్రత్యామ్నాయాన్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో తయారుచేసి బాధితులకు సాంత్వన చేకూర్చవచ్చని రూపావత్ ఉదయ్‌కిరణ్ తెలిపారు. రానున్న రోజుల్లో వాణిజ్య పరంగా దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.