Andhra Pradesh: నిజామాబాద్ లో విద్వేష ప్రసంగం.. అక్బరుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు!
- బెయిల్ రద్దుచేయాలని ఓ లాయర్ పిటిషన్
- బెయిల్ నిబంధనల్ని ఒవైసీ ఉల్లంఘించారని వ్యాఖ్య
- విచారణను ఈ నెల 22కు వాయిదా వేసిన కోర్టు
మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి స్పెషల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. 2013లో నిజామాబాద్ లో చేసిన ఓ ప్రసంగం విద్వేషపూరితంగా ఉందని గతంలో దాఖలైన కేసులో ఒవైసీ బెయిల్ పై ఉన్నారు. తాజాగా ఈ బెయిల్ ను రద్దుచేయాలని న్యాయవాది కాషిమ్ శెట్టి కరుణసాగర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు, తమ స్పందనను తెలియజేయాలని ఒవైసీని కోరింది.
ఈ సందర్భంగా పిటిషనర్ స్పందిస్తూ.. అక్బరుద్దీన్ గత నెల 23న కరీంనగర్ లో ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒవైసీ బెయిల్ పిటిషన్ లోని నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. దీంతో అక్బరుద్దీన్ తరఫు న్యాయవాది స్పెషల్ మోషన్ దాఖలు చేయగా, తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.