MS Dhoni: అస్సాల్ట్ రైఫిల్ ఎక్కుపెట్టిన ధోనీ... నేటితో సైనిక విధులకు ముగింపు!
- కశ్మీర్ లో సైనిక విధులకు హాజరైన ధోనీ
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారిక హోదాలో హాజరు
- ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులకు పరామర్శ
టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ వెస్టిండీస్ టూర్ కు వెళ్లకుండా కశ్మీర్ లోయలో సైనిక విధులకు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ధోనీ టెర్రిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో అధికారిగా కొనసాగుతున్నాడు. దాంతో, జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వర్తించేందుకు వెళ్లగా, ఆ సమయంలోనే ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్ర విభజన కూడా జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా ధోనీ దక్షిణ కశ్మీర్ లో విధుల్లో కొనసాగేందుకే ఆసక్తి చూపించాడు. నేటితో ధోనీ విధులు ముగిశాయి.
లడఖ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధోనీ, అక్కడ ఆర్మీ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించాడు. అంతేకాదు, షూటింగ్ రేంజ్ లో సహచరులతో కలిసి ఏకే-47, ఇన్సాస్ వంటి రైఫిళ్లను ఎక్కుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తున్నాయి.