Tamilnadu: డీఎండీకే అధినేత వైగో ‘సెల్ఫీ’ గోల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు, తమిళ పార్టీలు!
- కార్యకర్తలతో సెల్ఫీ దిగేందుకు రూ.100 కోరిన వైగో
- పార్టీ నిధుల కోసం సరికొత్త కార్యక్రమం
- రూ.100 ఇవ్వలేని ఓ కార్యకర్తను వెనక్కి పంపిన వైగో
తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వైగో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ ఎండీఎంకే కార్యకర్తతో ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాతో పాటు తమిళపార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంతకూ అసలు విషయం ఏంటంటే..ఎండీఎంకే కు నిధుల కోసం ‘సెల్ఫీ విత్ వైగో’ అనే కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. ఇందులో భాగంగా వైగోతో సెల్ఫీ దిగాలంటే కార్యకర్తలు రూ.100 చెల్లించాలి. ఈ క్రమంలో కృష్ణగిరికి బయలుదేరిన వైగో అంబూరు పట్టణం వద్ద తన కాన్వాయ్ ను ఆపారు. దీంతో కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయనతో ఫొటో దిగేందుకు పలువురు కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వైగో వారి దగ్గర రూ.100ను అడిగి తీసుకుని మరీ ఫొటో దిగారు. ఈ క్రమంలో వైగోతో ఫొటో దిగేందుకు ఓ కార్యకర్త రాగా, అతడిని ఎండీఎంకే అధినేత డబ్బులు అడిగారు. దీంతో తన వద్ద లేవని చెప్పడంతో వైగో అతనితో ఫొటో దిగకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లతో పాటు తమిళ పార్టీలు కూడా వైగోపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తతో సెల్ఫీ దిగకుండా అతడిని అవమానించడం ఏంటని పలువురు వైగోను ప్రశ్నించారు. కాగా దీనిపై ఎండీఎంకే వర్గాలు మౌనం దాల్చాయి.