Andhra Pradesh: పోలీసుల భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం జగన్ వద్దకు దూసుకెళ్లిన వ్యక్తి!
- విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఘటన
- తనకు ఉద్యోగం కల్పించాలని బాధితుడి వినతి
- వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దిన వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలో పోలీస్ వలయాన్ని ఎలాగో దాటిన ఓ దివ్యాంగుడు జగన్ వద్దకు దూసుకెళ్లాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ..‘నా పేరు దుర్గారావు. చిన్నప్పుడు గాలిపటం కోసం కరెంట్ స్తంభం ఎక్కడంతో షాక్ కొట్టి రెండు చేతులూ పోయాయి. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు సెన్సార్లతో పనిచేసే కృత్రిమ చేతులను తెప్పించి నన్ను ఆదుకున్నారు. అలాగే బతకడానికి ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేకపోయారు. సీఎం గారూ.. దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి’ అంటూ వినతిపత్రం సమర్పించాడు.
దీంతో ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ దుర్గారావుకు ఉద్యోగం కల్పించే ఏర్పాట్లు చేయాలని తన కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని ఆదేశించారు. ఇదిలా ఉంచితే, అసలు ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని సీఎం దగ్గరకు ఎలా వచ్చాడన్న విషయమై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.