Narendra Modi: 'సీడీఎస్'... త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి: ప్రధాని మోదీ వెల్లడి
- చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని సృష్టిస్తున్న కేంద్రం
- త్రివిధ దళాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందన్న మోదీ
- ప్రస్తుతం సీడీఎస్ పదవికి అర్హతలు, నిబంధనలపై కసరత్తులు జరుగుతున్నాయంటూ వివరణ
భారత్ లో ఇప్పటివరకు సైన్యం, వాయుసేన, నావికాదళం దేనికవే ప్రత్యేకం. వాటికి విడిగా అధిపతులు ఉండడం తెలిసిందే. అయితే, సాయుధ దళాలన్నీ ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని, అందుకే కొత్తగా సాయుధ దళాల కోసం ఉమ్మడి అధిపతి పదవిని సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' (సీడీఎస్) పదవి ద్వారా భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని, తద్వారా మూడు దళాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని వివరించారు.
సాంకేతిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న వేళ సైనిక, వాయుసేన, నావికాదళాలు విడివిడిగా వ్యూహాలు రూపొందించుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావని, త్రివిధ దళాలు ఉమ్మడిగా కార్యాచరణకు దిగాలంటే 'సీడీఎస్' పదవి అవసరమని తాము భావిస్తున్నామని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం 'సీడీఎస్' పదవికి అర్హతలు, నిబంధనలపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ 'సీడీఎస్' గురించి తెలిపారు.