Asaduddin Owaisi: గాంధీని చంపిన వారికి నన్ను చంపడం ఓ లెక్కా?: అసదుద్దీన్ ఒవైసీ
- గాడ్సే వారసులు ఏదో ఒకరోజు తనను కూడా చంపేస్తారని ఒవైసీ వ్యాఖ్య
- బీజేపీ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టీకరణ
- కశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంపై అభ్యంతరం
దేశంలో గాడ్సే వారసులు ఇంకా ఉన్నారని, ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నందుకు ఏదో ఒకనాడు తనను చంపేస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. గాంధీనే చంపిన వారికి ఒవైసీని చంపడం ఓ లెక్కా? అని వ్యాఖ్యానించారు. అయినా తాను మాత్రం పోరాటం ఆపబోనని, బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మైనారిటీ వర్గాల కోసం ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమేనని అన్నారు. జమ్మూకశ్మీర్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఉండాల్సిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు.