Nakka Anandababu: మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై పోలీసు కేసు!
- స్థలం లీజు విషయంలో వివాదం
- రూ. 40 లక్షల సామగ్రి పోయిందన్న బాధితుడు
- కేసును విచారిస్తున్నామన్న పోలీసులు
ఓ స్థలాన్ని ఖాళీ చేయించే విషయమై, తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగి, దాడి చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సహా పలువురిపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే, విద్యానగర్ నివాసి అయిన అద్దంకి శ్రీకృష్ణ, అమరావతి రోడ్డు, డొంకరోడ్డు ప్రాంతాల్లో టెంట్ హౌస్, లైటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తన వ్యాపార విస్తరణ నిమిత్తం కర్లపూడి బాబూప్రకాష్ అధీనంలో ఉన్న నాలుగున్నర ఎకరాల స్థలాన్ని 2008లో 2021 వరకూ లీజుకు తీసుకుని, రూ. 6.50 లక్షలు ఇచ్చి, అక్కడ కల్యాణమండపం సామాన్లు పెట్టుకునేందుకు పెద్ద షెడ్లను నిర్మించుకున్నారు. 2015లో ఈ స్థలం విలువ పెరగడంతో, దీన్ని ఖాళీ చేయాలన్న ఒత్తిడి శ్రీకృష్ణపై పెరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కర్లపూడి బాబూప్రకాష్ గోడౌన్ ను ఖాళీ చేయాలని ఇబ్బందులు పెట్టారు. తనకు 2021 వరకూ లీజు హక్కులున్నాయని చెబుతూ, శ్రీకృష్ణ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఇదిలావుండగా, నిన్న శ్రీకృష్ణ కుమారుడు శివసాయి, మరో పది మంది వర్కర్లు షెడ్ల వద్ద పనుల్లో ఉండగా, నిందితులు సహా అక్కడికి వచ్చిన కొందరు షెడ్లను ధ్వంసం చేసి, రూ. 40 లక్షల విలువ చేసే సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీకృష్ణ పోలీసులను ఆశ్రయించగా, కేసును రిజిస్టర్ చేశామని, విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.