abhinandan vardhaman: వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలు కళ్లారాచూశా: స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్
- పాకిస్థాన్ ఎఫ్-16ని కూల్చివేయడం స్క్రీన్‌పై గమనించాను
- ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితి తెలియజేస్తున్నా
- దెబ్బతీయాలనే పాక్ విమానం భారత్ భూభాగంలోకి వచ్చింది
వింగ్ కమాండర్ అభినందన్ వీరోచిత పోరాటాన్ని, పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘటనను తాను కళ్లారా చూశానని స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ తెలిపారు. ఆ సమయంలో నేను అభినందన్‌కు వాతావరణ పరిస్థితులు తెలియజేస్తూ స్క్రీన్‌పై ఆయన సాహసాన్ని గమనిస్తున్నానని తెలిపారు. యుద్ధ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రభుత్వం ఇచ్చే యుద్ధ సేవా పతకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మింటీ అందుకుంది. ఈ పురస్కారం అందుకున్న తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా మింటీ మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 27న బాలాకోట్ స్థావరాలపై భారత్ యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి గట్టి ప్రతిస్పందన ఎదురవుతుందని భావించి అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఊహించినట్టే మనల్ని దెబ్బకొట్టేందుకు పాకిస్థాన్ ఎఫ్-16 మన గగనతలంలోకి ప్రవేశించింది. అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం అప్రమత్తంగా ఉండడంతో వారి వ్యూహం ఫలించలేదు. అదే సమయంలో అభినందన్ వర్థమాన్ ఎఫ్-16ని గురిపెట్టి కూల్చివేశాడు’ అని మింటీ తెలిపారు.
ఈ సందర్భంగా మన మిగ్ కూడా కూలిపోవడం, పారాచ్యూట్ సాయంతో పాకిస్థాన్ భూభాగంలో దిగిన అభినందన్‌ను స్థానికులు పట్టుకుని పాకిస్థాన్ సైనికులకు అప్పగించడం తెలిసిందే. దౌత్యపరమైన ఒత్తిడితో దాయాది దేశం మూడు రోజుల తర్వాత అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది.