Prabhas: 'సాహో'లో నటించినందుకు రూ. 100 కోట్ల పారితోషికం'పై ప్రభాస్ సమాధానమిది!
- ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు
- గత సినిమా పారితోషికంలో 20 శాతం తగ్గించుకున్నా
- 'ముంబై మిర్రర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'సాహో'లో నటించినందుకుగాను ప్రభాస్ రూ. 100 కోట్లను పారితోషికంగా తీసుకున్నాడట. భారత చలనచిత్ర రంగంలో రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడు ప్రభాస్... ఇలా గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపు రూ. 250 నుంచి రూ. 300 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను తీస్తున్నారన్న సంగతి తెలిసిందే.
ఇక తాను రూ. 100 కోట్లు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలపై 'ముంబై మిర్రర్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. "బాహుబలి చిత్రం రేంజ్ ని పెంచింది. ఇదే సమయంలో నిర్మితమైన 'సాహో'... రూ. 250 కోట్ల బడ్జెట్ తో వస్తోంది. అంటే, నేను నా సహజ పారితోషికం కన్నా ఎక్కువ తీసుకోవాల్సిందే. గత సినిమా పారితోషికంలో 20 శాతాన్ని తగ్గించుకున్నాను. అయితే, చిత్ర నిర్మాతలైన నా స్నేహితులు ఆ డబ్బును కూడా ఇస్తామని చెప్పారు. కానీ, వారి డబ్బును నేను తీసుకోలేదు. ఈ సినిమాతో తామెంత డబ్బును సంపాదిస్తామన్న విషయాన్ని పట్టించుకోకుండా వారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు" అని ప్రభాస్ అన్నారు.
ఈ చిత్రాన్ని వి.వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు శ్రద్ధా కపూర్, జాకీ షరాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, ఎల్విన్ శర్మ, చుంకీ పాండే తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది.