Andhra Pradesh: తెలుగులో ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. వైరల్!
- సమర్థ్ అనే పథకం తెచ్చామని ప్రకటన
- ఏపీలో 12 వేల మంది యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడి
- వీరికి దుస్తుల తయారీలో ఉపాధి చూపుతామని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం తమ పథకాలకు ప్రాచుర్యం కల్పించేందుకు స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఇటీవల తెలుగులో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘సమర్థ్’ అనే పథకాన్ని తీసుకొచ్చిందని స్మృతీ ఇరానీ తెలిపారు.
ఇందులో భాగంగా ఏపీలోని 12,000 మంది యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వీరికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన స్మృతీ ఇరానీ, తన ట్వీట్ కు ఓ వీడియోను కూడా జతచేశారు.