polavaram: పోలవరం ప్రాజెక్టు కోసం రేపు రీటెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం: మంత్రి అనిల్
- నవంబర్ 1 నుంచి మళ్లీ పనులు ప్రారంభిస్తాం
- రివర్స్ టెండరింగ్ లో ‘నవయుగ’ కూడా పాల్గొనవచ్చు
- 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేపటి నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు రీటెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నవంబర్ 1 నుంచి మళ్లీ పనులు ప్రారంభిస్తామని అన్నారు. ధరలు పెరిగితే ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని గుర్తుచేశారు. 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని ఏపీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అనిల్ కుమార్ ప్రస్తావిస్తూ.. ‘నవయుగ’ బాగా పనిచేసినప్పటికీ, గత ప్రభుత్వ హయాంలో ఆ కంపెనీకి టెండర్ కేటాయించిన విధానం కరెక్టు కాదని అన్నారు. రివర్స్ టెండరింగ్ లో నవయుగ కంపెనీ కూడా పాల్గొనవచ్చని సూచించారు.