Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం మూర్ఖత్వం వల్లే వరదముంపు: టీడీపీ నేత దేవినేని ఉమ
- ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగానే వరదలు
- బాధితులకు సహాయక చర్యలు అందడం లేదు
- వరదనీటిని ముందుగానే దిగువకు ఎందుకు మళ్లించలేదు?
వైసీపీ ప్రభుత్వం మూర్ఖత్వం, తెలివితక్కువతనం వల్ల ప్రజలు వరద ముంపునకు గురయ్యారని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరదనీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే వరదలు వచ్చాయని విమర్శించారు. వరదనీటిని ముందుగానే దిగువకు ఎందుకు మళ్లించ లేదని ప్రశ్నించారు. అలా చేసి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతాంగానికి నష్టం జరిగేది కాదని అన్నారు. వరద ముంపు బాధితులకు సహాయక చర్యలు అందడం లేదని విరుచుకుపడ్డారు. లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారని, వరదల కారణంగా వారి పొలాలు నీటమునగగా, పశువులు కొట్టుకుపోయాయని, కనీసం, తమ ప్రాణాలు అయినా కాపాడాలని అక్కడి ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారని అన్నారు.