POLLAND: పోలెండ్ లో మిస్టరీ గ్రామం.. పదేళ్లలో ఒక్క మగపిల్లాడు కూడా పుట్టని వైనం!
- పోలెండ్ లోని మైజెస్ డ్రాజెన్ స్కీ గ్రామంలో ఘటన
- ముఖ్యమైన బాధ్యతలన్నీ మహిళలవే
- మగపిల్లాడిని కంటే బహుమతి ఇస్తామంటున్న మేయర్
భారత్ లో పుడుతున్న చిన్నారుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంటోంది. 2019 గణాంకాల ప్రకారం ప్రస్తుతం మనదేశంలో ప్రతీ 1000 మంది మగ పిల్లలకు కేవలం 943 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. కానీ రష్యాతో పాటు కొన్ని యూరప్ దేశాల్లో దీనికి రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. అక్కడ మగపిల్లలతో పోల్చుకుంటే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. అయితే పోలెండ్ లోని ‘మైజెస్ డ్రాజెన్ స్కీ’ గ్రామంలో మాత్రం ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా అంటే గత పదేళ్లలో ఈ ఊరిలో ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదట. ఈ ఊరిలో మొత్తం 300 మంది ఉంటున్నారు. అయితే 2010 తర్వాత ఇక్కడ అబ్బాయిలు పుట్టలేదు.
ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయం శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదట. దీంతో ఇది మిస్టరీగా మారిపోయింది. ఊరిలో మగ పిల్లలు లేకపోవడంతో అమ్మాయిలే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అగ్నిమాపక దళం, అత్యవసర విభాగం సహా పలు రంగాల్లో రాణిస్తున్నారు. అగ్నిమాపక దళంలో రెండున్నరేళ్ల వయసున్న మజ గోలాస్జ్ కూడా ట్రైనింగ్ పొందుతోంది. మరోవైపు ఈ కౌంటీ మేయర్ రాజ్ముండ్ ఫ్రిస్కో మగ పిల్లలను కనే తల్లిదండ్రులకు మంచి బహుమతి ఇస్తామని చెబుతున్నారు. అయినా ఇప్పటివరకూ గత 10 సంవత్సరాల్లో ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదు.