team India: ఈ మాత్రం దానికి అంత బిల్డప్ ఎందుకు?: రవిశాస్త్రి ఎంపికపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు
- ఆయనే అనుకున్నప్పుడు మిగిలిన వారిని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు?
- కోహ్లీకి ఏది నచ్చితే అదే చెల్లుబాటు అవుతోంది
- ప్రపంచ కప్ కోల్పోయాం...తదుపరి మ్యాచ్‌లు హుష్‌కాకే అని సెటైర్లు
టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని నాలుగోసారి ఎంపిక చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతరంగస్వామి కమిటీ ఏకగ్రీవ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ‘ఈ మాత్రం దానికి అంత బిల్డప్ ఎందుకు. అతన్నే ఎంపిక చేయాలనుకున్నప్పుడు మిగిలిన వారికి ఇంటర్వ్యూలు చేయడం ఎందుకు?. ముందే ప్రకటించేస్తే సరిపోయేది కదా’ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రినే కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ‘టీమ్ ఇండియా 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ కోల్పోయింది. ఇకపై 2020, 2021లలో జరిగే టీ20 ప్రపంచకప్లూ హుష్ కాకి అన్నమాట' అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
కోహ్లీ తనకు నచ్చింది చెల్లుబాటు చేయించుకుంటున్నాడని మండిపడుతున్నారు. 2007 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టు మేనేజర్‌గా, 2014-16 మధ్య కాలంలో జట్టు డైరెక్టర్‌గా రవిశాస్త్రి వ్యవహరించాడు. 2017 నుంచి కోచ్‌గా కొనసాగుతున్నాడు.