Pawan Kalyan: 151 సీట్లు ఇచ్చింది డ్రోన్ రాజకీయాలు చేయడానికా?: పవన్ కల్యాణ్
- తాజా రాజకీయాలపై పవన్ ఘాటు స్పందన
- ప్రజలు వరద కారణంగా అల్లాడుతుంటే డ్రోన్ రాజకీయాలు ఏంటని మండిపాటు
- లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఆదుకోవాలంటూ డిమాండ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఘాటుగా స్పందించారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చింది డ్రోన్ రాజకీయాలు చేయడానికి కాదంటూ అధికార వైసీపీపై మండిపడ్డారు. వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న ప్రజలను ఆదుకోకుండా, కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునుగుతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేసి చూడడం ఏంటని వైసీపీ మంత్రులను నిలదీశారు.
ఎక్కడైనా ఓ నదికి వరద తీవ్రత పెరిగితే కరకట్టపై ఉండే నిర్మాణాలు మునిగిపోతాయని, ఈ మాత్రం దానికి డ్రోన్ లు ఎగరేసి రాజకీయాలు చేయాల్సిన పనిలేదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. మాజీ సీఎం ఇంటిని వరదల్లో ముంచేస్తారా? అంటూ విపక్షం ప్రశ్నిస్తుంటే, మునిగిందా? లేదా? అని చూసేందుకు అధికార పక్షం వెళుతోందని పవన్ అసహనం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.