Telangana: కోట్ల సంపాదన కోసం స్మగ్లర్లుగా మారిన ఖమ్మం ఇంజనీరింగ్ విద్యార్థులు!
- గంజాయికి బానిసలుగా మారిన విద్యార్థులు
- తల్లిదండ్రులు పాకెట్ మనీ ఆపేయడంతో స్మగ్లింగ్ వైపు
- దొరికిపోయి కటకటాలపాలు
గంజాయికి బానిసలుగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులు కోట్లు సంపాదించాలన్న అత్యాశతో స్మగ్లర్లుగా మారి చివరికి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ బస్టాండ్‌లో సాయంత్రం ఏడు గంటల వేళ అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేస్తే గంజాయి పొట్లాలు కనిపించాయి. దీంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తే మరో ముగ్గురు విద్యార్థుల పేర్లు బయటకు వచ్చాయి. వీరందరూ ఇంజనీరింగ్ విద్యార్థులని తెలియడంతో పోలీసులు విస్తుపోయారు. వీరిని భానుతేజా రెడ్డి, సాయి నరేశ్, అఖిల్, షేక్ నయీం, సాయి కుమార్‌లుగా గుర్తించారు.
ఖమ్మంలో ఇంజనీరింగ్ చదువుతున్న వీరంతా గంజాయికి బానిసలుగా మారారు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతోపాటు అప్పులు చేసి మరీ గంజాయి కొంటున్నారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వడం ఆపేశారు. దీంతో విలవిల్లాడిపోయిన వారందరూ కలిసి డబ్బుల కోసం గంజాయిని స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే ఆలస్యం అరకులోని సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి తమకోసం కొంత ఉంచుకుని మిగతాది అమ్మడం ప్రారంభించారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా దందా సాగించారు. కిలోకు దాదాపు 8 వేల వరకు మిగలడంతో స్మగ్లింగ్‌ను కంటిన్యూ చేశారు. చిన్నగా మొదలైన వ్యాపారం లాభాలు తెచ్చిపెడుతుండడంతో పెద్ద దాని రుచిమరిగారు. కోట్ల సంపాదనే ధ్యేయంగా వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయారు. చివరికి కటకటాల పాలయ్యారు.