Congress: కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం షాక్.. బీజేపీకి జైకొట్టిన భూపేందర్ సింగ్ హుడా!
- ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన నేత
- కాంగ్రెస్ పార్టీ దారితప్పిపోయిందని విమర్శ
- ఈ రద్దును పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారని ఆగ్రహం
జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రస్తుతం నిరసన తెలుపుతోంది. అయితే కాంగ్రెస్ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, హరియాణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా చేరారు. ప్రస్తుతం ఉన్నది ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని తాను సమర్థిస్తానని చెప్పుకొచ్చారు.
హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో హుడా మాట్లాడుతూ..‘కేంద్రం ప్రభుత్వం ఎప్పుడు మంచిపని చేసినా నేను సమర్థిస్తాను. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని నా సహచరులు చాలామంది వ్యతిరేకించారు. నా పార్టీ దారితప్పింది. అది గతంలో ఉన్న పాత కాంగ్రెస్ ఎంతమాత్రం కాదు. దేశభక్తి, ఆత్మగౌరవం విషయానికి వస్తే నేను అస్సలు రాజీపడను’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా(తాత్కాలిక) సోనియాగాంధీ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీనియర్ నేత హుడా తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.