Krishna River: వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు కిన్లే బాటిళ్లు అడగడం దారుణం: వర్ల రామయ్య
- కృష్ణా నదికి పోటెత్తిన వరదలు
- ముంపు బారినపడిన గుంటూరు జిల్లా పెసర్లంక గ్రామం
- బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ప్రజాప్రతినిధులు
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు జిల్లా వేమూరు మండలం పెసర్లంక గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో ఇళ్లన్నీ మునిగిపోవడంతో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక గ్రామస్తులు అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులతో కూడిన ఓ బోటు అక్కడి రావడంతో గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి. నేతలకు తమ గోడు వెళ్లబోసుకుందామని భావించిన గ్రామస్తులకు ఊహించని నిరాశ ఎదురైంది. బోటులో ఉన్న వైసీపీ నేతలు కిన్లే వాటర్ బాటిల్ ఉందా? అంటూ గ్రామస్తులనే ఎదురు ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది.
దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ లో ప్రతిస్పందించారు. "అయ్యా ఏపీ సీఎం గారూ, వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు కిన్లే వాటర్ కావాలని హుకుం జారీచేయడం దారుణం. యధా రాజా తథా ప్రజ అన్నట్టుంది మీ పాలన. అసలే బాధల్లో ఉన్నవారిని కిన్లే బాటిల్ అడగడం అమానుషం. వైసీపీ వారి వ్యవహార శైలిలో బట్టబయలైంది... ఖర్మ" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.