KCR: రూ.2 లక్షల కోట్లు దాటనున్న తెలంగాణ బడ్జెట్.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ కేసీఆర్ ఆదేశాలు
- ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నీటిపారుదల, వ్యవసాయ, సంక్షేమ పథకాలకు అధిక కేటాయింపులు
- ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్?
ఈ నెల చివర్లో, లేదంటే సెప్టెంబరులో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్ ఏకంగా రూ.2 లక్షల కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాలను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా కేసీఆర్ వద్దే ఉంది. బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్‌ను కనుక విస్తరించకుంటే కేసీఆరే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే నీటిపారుదల, వ్యవసాయ, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ సందర్భంగా అప్పట్లో రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేసీఆర్ ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు కేటాయించిన వాటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.