JNU: జేఎన్యూ విద్యార్థి నేత షెహ్లా రషీద్ పై ఫిర్యాదు చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది
- కశ్మీర్ లో కల్లోలం అంటూ షెహ్లా వ్యాఖ్యలు
- షెహ్లాను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేసిన సుప్రీం న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ
- భారత ప్రభుత్వంపైనా, సైన్యంపైనా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తోందంటూ ఆరోపణ
కశ్మీర్ లో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రం సైన్యం గుప్పిట్లో ఉందని, పోలీసుల అధికారాలను గుంజేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేఎన్ యూ విద్యార్థి నేత షెహ్లా రషీద్ పై సుప్రీం కోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. భారత ప్రభుత్వం, భారత సైన్యానికి వ్యతిరేకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ, షెహ్లా రషీద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీవాస్తవ డిమాండ్ చేశారు. షెహ్లా చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, నిరాధారమైన కట్టుకథలని పేర్కొన్నారు.
మరోవైపు భారత సైన్యం కూడా షెహ్లా ఆరోపణలను 'అభూత కల్పనలు' అంటూ కొట్టిపారేసింది. అంతకుముందు షెహ్లా, సైనికులు కశ్మీరీల ఇళ్లలోకి వెళ్లి మరీ యువకులను బయటికి ఈడ్చుకువస్తున్నారని, ఇప్పుడక్కడ ఏదీ ప్రజల పక్షాన జరగడంలేదని తీవ్ర ఆందోళనకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసింది.