chandrayaan-2: నేడు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2.. మరికాసేపట్లో కీలక ఆపరేషన్

  • మరికాసేపట్లో ద్రవ ఇంజిన్‌ను మండించనున్న శాస్త్రవేత్తలు
  • ప్రయోగించిన 29 రోజుల తర్వాత జాబిల్లి కక్ష్యలోకి
  • వచ్చే నెల 7న చంద్రుడిపై ల్యాండింగ్

చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు నేడు మరో కీలక ఘట్టానికి సిద్ధమయ్యారు. మరికాసేపట్లో అంటే ఈ ఉదయం 9:30 గంటలకు చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. గత నెల 22న జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన శాస్త్రవేత్తలు.. 29 రోజుల తర్వాత నేడు ద్రవ ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.  

ఫలితంగా స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించుకుని దశ, దిశ మార్చుకుని జాబిల్లి కక్ష్యలోకి వెళ్లనుంది. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1:30-2:30 గంటల మధ్యలో చంద్రుడిపై ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ కానుంది. అంతకంటే ముందు వచ్చే నెల 2న శాస్త్రవేత్తలు రెండు విన్యాసాలు చేపట్టనున్నారు. తద్వారా ల్యాండింగ్ సాఫీగా జరిగేలా చూస్తారు. జాబిల్లిపై ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత అందులోంచి రోవర్ బయటకు వస్తుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో ప్రయాణించే రోవర్ 14 రోజుల్లో 400 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. చంద్రుడిపై తీసే ఫొటోలను ప్రతీ 15 నిమిషాలకు భూమిపైకి చేరుస్తుంది.  

  • Loading...

More Telugu News