Srisailam: సాగర్, శ్రీశైలం గేట్ల మూసివేత... పర్యాటకుల అసంతృప్తి!
- నిన్న మూసుకున్న క్రస్ట్ గేట్లు
- కృష్ణానదిపై నిండిన అన్ని జలాశయాలు
- గేట్ల మూసివేతతో నిరాశగా వెనుదిరుగుతున్న పర్యాటకులు
గడచిన రెండు వారాలుగా అద్భుతమైన జలదృశ్యంతో అలరించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూతబడ్డాయి. ఎగువ నుంచి వస్తున్న వరద 2 లక్షల క్యూసెక్కులకు లోపు చేరడంతో, విద్యుత్ ఉత్పత్తి, వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు తోడు, ప్రాజెక్టులను పూర్తిగా నింపేందుకు మాత్రమే నీరు సరిపోతుందని భావించిన అధికారులు, రెండు ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లనూ మూసివేశారు. దీంతో వందల అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జాలువారే దృశ్యాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను నిన్న సాయంత్రం, సాగర్ గేట్లను నిన్న రాత్రి అధికారులు మూసివేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా కాలువలకు తోడు కుడి, ఎడమ గట్టు కాలువల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ, వచ్చిన నీటిలో కొంత మొత్తాన్ని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా పులిచింతలకు, లెఫ్ట్, రైట్ కెనాల్స్ ద్వారా వ్యవసాయానికి నీరు విడుదల అవుతోంది. ఇదే సమయంలో రెండు కెనాల్స్ ద్వారా పరీవాహక ప్రాంతాల్లోని అన్ని చెరువులనూ నింపాలని ఆదేశాలు ఇచ్చినట్టు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, కృష్ణా ఆయకట్టులోని ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ జలాశయాలు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండుతాయని అధికారులు అంటున్నారు. ఎగువన వర్షాలు పడితే, ఎక్కడా నిలిపే పరిస్థితి లేదని అంటున్నారు.