Vijay Sai Reddy: తన కొంప మాత్రం మునగకూడదంటున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి
- డ్యామ్ ల నుంచి నీటి విడుదల ఇంజనీర్ల నిర్ణయం
- ఎంత వస్తుందో చూస్తూ, అందుకు తగ్గట్టు వదులుతారు
- బ్యారేజ్ దిగువ ప్రజలు బలైపోయినా ఫర్లేదంటున్న చంద్రబాబు
- ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి విమర్శలు
ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదతో దిగువన ఉన్న ఎవరి ఇల్లు అయినా మునిగితే ఫర్వాలేదని, తన ఇల్లు మాత్రం మునగటానికి వీల్లేదని అంటూ, చంద్రబాబు కొత్త కుట్రలను తెరపైకి తెస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లను పెట్టారు.
"ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు" అని ఎద్దేవా చేశారు.
అంతకు ముందు "అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు ‘తీసేసిన తాసిల్దార్లు’." అని విమర్శలు గుప్పించారు.