raavi Kondala rao: ఆ రోజున రాజబాబు భయపడుతూ నా ముందు నుంచున్నాడు: నటుడు రావి కొండలరావు
- నేను రాసిన నాటకాల్లో ఒకటి 'కథ కంచికి'
- ఆఫీస్ బాయ్ పాత్రలో రాజబాబు అదరగొట్టేశాడు
- అలా కేవీ రెడ్డిగారి దృష్టిలో రాజబాబు పడ్డాడు
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రావి కొండలరావు మాట్లాడుతూ, రాజబాబును గురించి ప్రస్తావించారు. "అప్పట్లో నేను 'కథ కంచికి' అనే ఒక నాటకం రాశాను. ఆ నాటకంలో ఆఫీస్ బాయ్ వేషం ఒకటి వుంది .. అది చాలా కామెడీగా చేయాలి. ఆ పాత్ర కోసం ఎవరైనా వుంటే చూడమని నేను పొట్టి ప్రసాద్ తో చెప్పాను.
'రాజబాబు అని ఒకడున్నాడు .. పాండి బజార్లో తిరుగుతూ ఉంటాడు .. నేను తీసుకొస్తాను .. పనికొస్తాడేమో చూడండి' అని పొట్టి ప్రసాద్ అన్నాడు. ఆ తరువాత ఆయన రాజబాబును నా దగ్గరికి తీసుకొచ్చాడు. రాజబాబు భయపడుతూ చాలా వినయంగా నా ముందు నుంచున్నాడు. నేను ఆ పాత్రను గురించి చదివి వినిపిస్తే చేస్తానని చెప్పాడు. ఆ నాటకంలో ఆఫీస్ బాయ్ గా రాజబాబు అదరగొట్టేశాడు. ఆ నాటకం చూసిన దర్శకుడు కేవీ రెడ్డి గారు, 'హరిశ్చంద్ర' సినిమాలో రాజబాబుకి వేషం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.