Telangana: అమెరికాకు చేరిన ప్రణయ్-అమృత విషాదగాథ.. వాషింగ్టన్ పోస్ట్ లో కథనం!
- 2018, సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య
- కిరాయి హంతకులతో చంపించిన మారుతీరావు
- ప్రత్యేకంగా ప్రచురించిన అమెరికా పత్రిక
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దళితుడైన ప్రణయ్ ను తన కూతురు అమృత పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన తండ్రి మారుతీరావు, కిరాయి హంతకులను పెట్టించి గతేడాది సెప్టెంబర్ 14న దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపగా, తాజాగా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రణయ్-అమృతల విషాదగాథను ప్రత్యేకంగా ప్రచురించింది.
దళితుడైన ప్రణయ్(23)ను తన కుమార్తె అమృత(21) పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక పోయిన మారుతీరావు తన పరువు పోయినట్లు భావించాడని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. భారత్ పలు అంశాల్లో ముందుకు దూసుకెళుతున్నప్పటికీ, కులాంతర వివాహాల విషయంలో ఇంకా వెనుకపడే ఉందని స్పష్టం చేసింది. 2017 గణాంకాల ప్రకారం భారత్ లో 5.8 శాతం కులాంతర వివాహాలు జరిగాయని చెప్పింది. ఈ విషయంలో గత 40 ఏళ్లలో పెద్దగా పురోగతి లేదని తేల్చిచెప్పింది.
అమృత స్కూలుకు వెళ్లే సమయంలోనే దళితులతో స్నేహం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. అయితే 9వ తరగతిలో ప్రణయ్ తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న మారుతీరావు ‘నిన్ను మన కులానికి చెందిన బిచ్చగాడికి ఇచ్చి అయినా పెళ్లి చేస్తా. కానీ తక్కువ కులానికి చెందిన ఎవ్వరినీ నువ్వు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోను’ అని అమృతను కొట్టినట్లు కథనం ప్రచురించింది.