Botsa Satyanarayana: ఏపీ రాజధానిపై త్వరలోనే నిర్ణయం... బొత్స కీలక వ్యాఖ్యలు!
- అమరావతిలో సాధారణ వ్యయం కంటే నిర్మాణ వ్యయమే అధికమన్న బొత్స
- రాజధాని అభివృద్ధిలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందంటూ వ్యాఖ్యలు
- రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ వెల్లడి
ఏపీ రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుత రాజధాని అమరావతిలో సాధారణ వ్యయం కంటే నిర్మాణ వ్యయమే మోయలేనంత భారంగా మారుతోందని అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందని తెలిపారు.
గత కొన్నిరోజులుగా వరదలు రావడంతో రాజధానిలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలిందని, ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ కాలువలు, డ్యామ్ లు నిర్మించాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేమంత సమంజసమైన వ్యవహారం కాదని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని, ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మరికొన్ని రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆ ప్రకటనలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.