INX-Media Case: ఐఎన్ ఎక్స్ మీడియా కేసు.. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
- యూపీఏ హయాంలో ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందం
- చిదంబరం తరపున వాదించిన సిబాల్, సింఘ్వీ
- సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న చిదంబరం
ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందంలో అవకతవకల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. చిదంబరం తరపున న్యాయస్థానంలో కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో చిదంబరం తరఫు లాయర్లు పిటిషన్ వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కాగా, యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందం కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీపెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ ఒప్పందాలు జరిగిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరం ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు తలెత్తడంతో ఆయనపై కేసు నమోదైంది. అరెస్టు కాకుండా ఇప్పటికే ఆయన పలుసార్లు కోర్టును ఆశ్రయించారు. చిదంబరం కస్టడీ కోరుతూ ఇప్పటికే సీబీఐ, ఈడీ పిటిషన్లు దాఖలు చేశాయి.