Bandar Port: బందరు పోర్టుపై ఎలాంటి సందేహాలు వద్దు: పేర్ని నాని
- బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుంది
- నవయుగ సంస్థ పనులను జాప్యం చేయడం వల్లే కాంట్రాక్టును రద్దు చేశాం
- ఆర్టీసీని త్వరలోనే ప్రభుత్వంలో విలీనం చేస్తాం
ఏపీలోని బందరు పోర్టు పనులు నిలిచిపోవడంతో దాని భవితవ్యంపై అందరిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బందరు పోర్టుపై ఉన్న అనుమానాలకు ఏపీ సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని తెరదించారు. బందరు పోర్టుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని... పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు. అయితే, నిర్మాణాన్ని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందా? లేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తుందా? అనే విషయంలో త్వరలోనే స్పష్టతను ఇస్తామని తెలిపారు.
బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు రహస్య జీవోలను తెచ్చారని చంద్రబాబు, నారా లోకేశ్ ఆరోపిస్తుండటం వారి అవగాహన లేమికి నిదర్శనమని పేర్ని నాని చెప్పారు. పోర్టు పనుల్లో నవయుగ సంస్థ జాప్యం చేస్తోందని... అందుకే, కాంట్రాక్టును రద్దు చేశామని తెలిపారు. జీవోలు డౌన్ లోడ్ చేసుకోవడం కూడా తెలియని వారికి... బురద చల్లడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు.