Tamil Nadu: చెన్నైలో పావురాల పందాలు.. 1750 కి.మీ. ఎగిరిన పిజియన్కి మొదటి బహుమతి
- వినూత్నంగా ఉంటుందని ఈ పోటీల ఆలోచన
- నిర్వహించింది ‘గుడ్‌విల్ పిజియన్ క్లబ్’
- తలపడిన 300 పావురాలు
సంక్రాంతి, ఇతర సందర్భాల్లో కోళ్ల పందాల మాట జోరుగా వినిపిస్తుంది. ఇక్కడ అక్కడా అని కాకుండా పలు చోట్ల పోటీలు జోరుగా సాగుతాయి. కోట్ల రూపాయల్లో పందాలు జరగడమే కాదు, పలువురు ప్రముఖులు ఈ పోటీల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా వుండే కోళ్ల పందాలే ఎందుకు అనుకున్న చెన్నైకి చెందిన ‘గుడ్‌విల్ పిజియన్ క్లబ్’ నగరంలో పావురాల మధ్య పందాలు నిర్వహించింది.
ఒక పావురం తక్కువ సమయంలో ఎంత దూరం ఎగురుకుంటూ వచ్చి చేరగలదన్నదే ఈ పోటీల ప్రత్యేకం. కొత్తగా పోటీలు ప్రారంభించినా శిక్షణ పొందిన 300 పావురాలు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. రత్నకుమార్ అనే వ్యక్తి పెంపుడు పావురం ఈ పోటీల్లో తన ప్రత్యేకతను చాటింది. కేవలం 11 రోజుల వ్యవధిలో ఏకంగా 1750 కిలోమీటర్ల దూరం ఎగురుకుంటూ వెళ్లివచ్చి లక్ష్యంపై వాలి మొదటి బహుమతిని కొట్టేసింది. వినూత్నంగా జరిగిన ఈ పోటీలు స్థానికులకు భలే వినోదాన్ని మిగిల్చాయి.