Congress: చిదంబరం వ్యక్తిత్వ హననానికి కేంద్రం కుట్ర చేస్తోంది!: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం
- చిదంబరం అరెస్టుకు సీబీఐ ప్రయత్నాలు
- అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేత
- బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ గాంధీ
‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులో దాదాపు 18 గంటల పాటు అదృశ్యమయ్యారు. ఆయన కోసం సీబీఐ అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
చిదంబరం వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకోసం వెన్నెముకలేని మీడియాను వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ తరహాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు చిదంబరం తాజాగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలుచేశారు. దీన్ని విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ ముందస్తు అరెస్టు బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు.