India: ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ కడుపుమంట.. ఏకంగా యూనిసెఫ్ కు ఫిర్యాదు!
- భారత్ కు మద్దతుగా మాట్లాడిన ప్రియాంక
- పాక్ మహిళకు దీటుగా జవాబిచ్చిన నటి
- ప్రియాంక వ్యాఖ్యలపై యూనిసెఫ్ చీఫ్ కు పాక్ ఫిర్యాదు
ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్ కు లేఖ రాశారు. ‘జమ్మూకశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు’ అని లేఖలో ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రాను ఓ పాకిస్థాన్ మహిళ.. ‘భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉంటూ ఇలా ప్రవర్తించడం ఏంటి?’ అని నిలదీసింది.
దీంతో ప్రియాంక స్పందిస్తూ..‘పాక్ లో నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా. ఇలా అందరిలో అరిచి నీ పరువు పోగొట్టుకోకు’ అని వ్యాఖ్యానించింది. తాజాగా ఆ వ్యాఖ్యలపైనే పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితిలోని యూనిఫెస్ కు ఫిర్యాదు చేసింది.