Andhra Pradesh: ఏపీ రాజధాని మార్పుపై ప్రధానికి జగన్ రాసిన లేఖను బయటపెట్టాలి: టీడీపీ నేత దేవినేని డిమాండ్
- సీఆర్డీఏ పరిధిలో ఒక కులానికి లబ్ధి జరిగిందని మోదీకి లేఖ రాశారు
- జగన్మోహన్ రెడ్డిది పారదర్శక ప్రభుత్వం కదా!
- కేంద్రానికి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ రాయడం ఏంటి?
ఏపీ రాజధాని అమరావతి మార్పుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖను బయటపెట్టాలని టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. రాజధానిని అమరావతి నుంచి ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సొంత పనులు చక్కబెట్టుకునేందుకు అమెరికాకు వెళ్లిన జగన్, రాజధానిపై అనుమానాలు కలిగే విధంగా మంత్రి బొత్సతో వ్యాఖ్యలు చేయించారని అనుమానం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానికి అమరావతిపై రాసిన కాన్ఫిడెన్షియన్ లేఖ సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ఒక కులానికి సంబంధించి ఎనభై ఐదు శాతం లబ్ధి పొందారు కనుక, రాజధాని అమరావతిని తరలిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని వార్తలు వస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే, పారదర్శక ప్రభుత్వం కదా? దేవుడి పరిపాలన కదా? ఇది రాజన్న రాజ్యం కదా? మరి, కేంద్రానికి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ రాయడం ఏంటి? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రానికి రాసిన ఈ ఉత్తరం బయటపెట్టమని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.