woman: తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన మహిళ.. పంచాయతీ సభ్యుల గ్యాంగ్ రేప్!
- హౌసింగ్ స్కీంలో ప్రయోజనం కల్పిస్తానని లంచం తీసుకున్న పంచాయతీ సభ్యుడు
- సాయం అందకపోవడంతో తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వమన్న మహిళ
- మరో నలుగురితో కలిసి ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్
పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. హౌసింగ్ స్కీంలో ప్రయోజనం కల్పిస్తానని ఓ మహిళ నుంచి టీఎంసీకి చెందిన పంచాయతీ సభ్యుడు ఒకరు డబ్బులు (లంచం) వసూలు చేశాడు. అయితే, ఆ మాటను నిలుపుకోవడంలో అతడు విఫలమయ్యాడు. దీంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన మహిళపై మరో ముగ్గురితో కలిసి పంచాయతీ సభ్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
పీఎంఏవై పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తానని మహిళకు మాటివ్వడంతో గతేడాది ఆమె పంచాయతీ సభ్యుడు ఎండీ బుల్బుల్కు ఏడు వేల రూపాయలు ముట్టజెప్పింది. అయితే, ఎంతకీ సాయం అందకపోవడంతో ఈ నెల 14న తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగేందుకు బుల్బుల్ ఇంటికి వెళ్లింది. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మాట్లాడుతున్న నిందితుడు బాధితురాలు డబ్బులు అడగ్గానే చిర్రెత్తిపోయాడు.
మిగతా ముగ్గురితో కలిసి ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లాడు. అనంతరం నలుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది. అంతేకాదు, ఆ తర్వాత తన ఇంటికొచ్చిన బుల్బుల్ ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడని తెలిపింది.