Andhra Pradesh: మోదీ, షా ఆశీస్సులు ఎలా వస్తాయి... విజయసాయిరెడ్డికి బీజేపీ నేత పురంధేశ్వరి కౌంటర్!
- పోలవరం, పీపీఏలపై కేంద్రం లేఖ రాసింది
- బీజేపీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది
- టీడీపీ తరహాలోనే వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది
అవినీతి నిర్మూలనలో ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత పురంధేశ్వరి మండిపడ్డారు. విద్యుత్ పీపీఏల పున:సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ నెపాన్ని విజయసాయిరెడ్డి తమపై నెట్టేయడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తరహాలోనే వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తమ వైఫల్యాలను బీజేపీపైకి నెట్టివేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, విద్యుత్ పీపీఏలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖను మర్చిపోవద్దని పురంధేశ్వరి సూచించారు. బీజేపీ కూడా ఈ అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఇంత జరిగితే మోదీజీ, అమిత్ షా జీలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయవద్దని ఆమె సూచించారు.