Andhra Pradesh: ప్రధాని మోదీకి చెప్పకుండానే జగన్ నిర్ణయాలు తీసేసుకున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ
- పోలవరంపై అథారిటీ అప్పుడే చెప్పింది.
- దానికి బీజేపీతో సంబంధం లేదు
- అమరావతిలో మీడియాతో బీజేపీ నేత
ప్రాంతీయ పార్టీల కారణంగా కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి రాజ్యమేలుతాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్ పీపీఏల పున:సమీక్ష విషయంలో జగన్ ఎవరిని సంప్రదించారని కన్నా ప్రశ్నించారు. మోదీని కలవకుండానే జగన్ నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో గతంలో అవినీతి జరిగిందంటున్న జగన్ ప్రభుత్వం ఎందులో అవినీతి జరిగిందో చెప్పలేకపోతోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు కారణంగా నిర్మాణ వ్యయం పెరుగుతుందనీ, సమయం వృథా అవుతుందని పోలవరం అథారిటీ ఎప్పుడో చెప్పిందని కన్నా గుర్తుచేశారు. ప్రధాని మోదీని సంప్రదించకుండానే జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనీ, వాటికి బీజేపీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని తరలించడం సరికాదని కన్నా అభిప్రాయపడ్డారు.
దీనివల్ల ప్రజల్లో ఇప్పుడు గందరగోళం నెలకొందని చెప్పారు. రాజధానిపై తన వైఖరి ఏంటో ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీల తరహాలో వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్ల పేరుతో ప్రజల మీదకు వదిలారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా దృష్టికి తీసుకెళతామని కన్నా స్పష్టం చేశారు.