Andhra Pradesh: ‘దొనకొండ’లో రియల్ ఎస్టేట్ బూమ్.. చుక్కలను అంటుతున్న భూముల ధరలు!
- అమరావతిపై బొత్స వ్యాఖ్యలతో మారిన సీన్
- ప్రకాశం జిల్లా దొనకొండకు రాజధాని వెళుతుందని టాక్
- 40 ఎకరాలు కొన్న గుంటూరు ఎమ్మెల్యే
అమరావతి రాజధానికి సరైన ప్రాంతం కాదని ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజధానిని వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని దొనకొండకు తరలించే అవకాశముందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2014 ఎన్నికల సమయంలోనూ వైసీపీ అధికారంలోకి వస్తే దొనకొండను రాజధాని చేస్తారనీ, అక్కడ విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీంతో దొనకొండ ప్రాంతంలో ఇప్పుడు రియల్ బూమ్ వచ్చేసింది.
పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొనకొండలో దిగిపోయి భూముల కొనుగోలుకు లావాదేవీలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ పెద్దగా రేట్లు లేని దొనకొండలో ఇప్పుడు ఎకరం రూ.60 లక్షలు పలుకుతుండగా, పక్క ప్రాంతాల్లో ఎకరం భూమి రూ.20 లక్షలకు చేరుకుంది. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనక్కి తగ్గకుండా భూములు కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే దొనకొండలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.