India: భారత్ పై మరోసారి విషం కక్కిన ఇమ్రాన్.. కశ్మీరీలను అణచివేస్తోందని ఆరోపణలు!
- భారత బలగాలు ప్రజలను అణచివేస్తున్నాయి
- స్వేచ్ఛగా బక్రీద్ ను కూడా జరుపుకోనివ్వడం లేదు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన పాక్ ప్రధాని
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. భారత ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో అమాయక ప్రజలను భారత బలగాలు అణచివేస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అందులో భాగంగా ఇటీవల జరిగిన బక్రీద్(ఈద్ అల్ అధా)ను కూడా స్వేచ్ఛగా జరుపుకోనివ్వలేదని విమర్శించారు. మతం కారణంగా హింసకు గురయ్యేవారికి ప్రపంచం సంఘీభావం తెలుపుతోందన్న ఇమ్రాన్, భారత్ పరిధిలోని కశ్మీర్ లోనూ అణచివేతను నిలువరించాలని పిలుపునిచ్చారు.
నేడు మతం కారణంగా హింసకు గురైన బాధితుల దినోత్సవం నేపథ్యంలో లక్షలాది మంది కశ్మీరీలు భారత్ పాలనలో అణచివేతకు గురికావడంపై దృష్టి సారించాల్సిందిగా ప్రపంచదేశాలను ఇమ్రాన్ ఖాన్ కోరారు. భారత ప్రభుత్వం కశ్మీరీల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను నిరాకరిస్తోందనీ, తీవ్రమైన హింసకు పాల్పడుతోందని ఇమ్రాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.