Jagan: ఇప్పటికైనా జగన్ తన తప్పును తెలుసుకోవాలి: గల్లా జయదేవ్
- అధికారంలోకి రాగానే పోలవరంను కొట్టేయాలని చూశారు
- వరద నష్టాలను ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయింది
- విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు
గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను వైయస్ రాజశేఖర రెడ్డి తిరగతోడలేదని... అందుకే హైదరాబాద్, సైబరాబాద్ లాభపడ్డాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తన తండ్రి వైఖరికి విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని... పోలవరం విషయంలో హైకోర్టు తీర్పు జగన్ తొందరపాటు చర్యలకు నిదర్శనమని చెప్పారు. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును కొట్టేయాలని జగన్ చూశారని... అందుకే వైయస్ బంధువు పీటర్ తో కమిటీ వేశారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ తన తప్పు తెలుసుకోవాలని సూచించారు. పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలను కలపడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకున్నాయని చెప్పారు.
వరదల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అంచనా కూడా వేయలేకపోయిందని గల్లా జయదేవ్ విమర్శించారు. వరద తీవ్రతకు 6 వేల ఎకరాలు నీట మునిగాయని... మంత్రులు దీనిపై తలో విధంగా మాట్లాడుతున్నారని... ప్రభుత్వం దీనిపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటను కోల్పోయి 10వేల రైతు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ప్రతి విషయాన్ని మోదీ, అమిత్ షాలకు చెప్పే చేస్తున్నామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారని తెలిపారు.