INX: చిదంబరంకు మాట్లాడే అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు!
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను న్యాయస్థానంలో హాజరుపరిచిన సీబీఐ అధికారులు
- జూన్ 6 నాటి ట్రాన్స్ క్రిప్ట్ ను పరిశీలించాలని కోర్టును కోరిన చిదంబరం
- ఈ సాయంత్రం 5.30 గంటలకు కోర్టు తీర్పు!
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ ఈ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచింది. గత రాత్రి నాటకీయ పరిణామాల మధ్య చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు నేడు మూడు గంటల పాటు విచారించారు. కోర్టులో వాదనల సందర్భంగా చిదంబరంను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరగా, సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
వాదనల సందర్భంగా న్యాయమూర్తి చిదంబరంకు మాట్లాడే అవకాశం కల్పించారు. జడ్జి అనుమతితో మాట్లాడిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు గాను జూన్ 6 నాటి ట్రాన్స్ క్రిప్ట్ ను పరిశీలించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని వెల్లడించారు. తనతో పాటు, తన కుమారుడి అకౌంట్ల వివరాలను కూడా అందించినట్టు తెలిపారు. లంచం అడిగానన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా చిదంబరం కస్టడీపై ఈ సాయంత్రం 5.30 గంటలకు కోర్టు తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వాదనలు ముగిశాయి.