Andhra Pradesh: చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని న్యాయస్థానం చెప్పలేదు: మంత్రి కొడాలి నాని
- పోలవరం కాంట్రాక్టులో అవినీతి జరిగింది
- కాంట్రాక్టు మారితే డబ్బు వెనక్కి ఇవ్వాలని టీడీపీ భయం
- బాబు చర్యలతో ప్రభుత్వానికి పెద్ద నష్టం జరిగింది
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయమై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు బంధువు, దేవినేని ఉమ కమీషన్దారు అయిన కాంట్రాక్టర్ కు అనుకూలంగా తీర్చు వచ్చిందని చెప్పి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం కాంట్రాక్టులో అవినీతి జరిగిందని, నిబంధనలను అతిక్రమించి చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు అప్పగించారని, చంద్రబాబు చర్యలతో ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం జరిగిందని ఆరోపించారు.
ప్రభుత్వానికి డబ్బులు మిగలాలన్న ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే, దీని ద్వారా తనకు నష్టం జరుగుతుందని, రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఆపాలని కోరుతూ న్యాయస్థానాన్ని కాంట్రాక్టరు ఆశ్రయించారని, తీర్పు చెప్పే వరకు ఈ ప్రక్రియను తాత్కాలికంగా ఆపాలని హైకోర్టు ఆదేశించిందే తప్ప, చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని చెప్పలేదని వ్యాఖ్యానించారు.
కాంట్రాక్టు మారితే డబ్బులు వెనక్కి ఇవ్వాలన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందని, ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమ ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయాన్ని కాపాడే క్రమంలో ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఏర్పడినా ముందుకే వెళతాం తప్ప, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.