Congress: సొంత కూతురును హత్య చేయించిన మహిళ వాంగ్మూలం ఆధారంగా చిదంబరాన్ని అరెస్ట్ చేస్తారా?: రణదీప్ సుర్జేవాలా
- చిదంబరాన్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం
- పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
- పన్నెండేళ్ల తర్వాత చిదంబరంను అరెస్టు చేశారు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ‘కాంగ్రెస్’ సీనియర్ నేత చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, సొంత కూతురును హత్య చేయించిన కేసులో జైలులో ఉన్న ఓ మహిళ వాంగ్మూలం ఆధారంగా నలభై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నేత చిదంబరంను అరెస్ట్ చేశారని అంటూ, ఐఎన్ఎక్స్ అధినేత ఇంద్రాణీ ముఖర్జీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఓ నిందితురాలు చెప్పిన ఆధారాలతో చిదంబరాన్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కేసు 2007 సంవత్సరం నాటిదని, పన్నెండేళ్ల తర్వాత చిదంబరంను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎఫ్ఐబీపీ అనుమతులు ఇచ్చిన వారిని కానీ, నేరానికి పాల్పడిన కంపెనీ అధికారులను కానీ అరెస్టు చేయలేదని విమర్శించారు.